This is one of the best stories about self confidence.
నమ్మకం
ఒక వ్యాపారి ఆర్ధిక సమస్యల నుండి బయటపడలేక సతమతమవుతూ, ఒంటరిగా ఒక తోటలో దీనంగా శూన్యంలోకి చూస్తూ కూలబడి ఉన్నాడు. ఇంతలో ఒక వయోవృద్ధుడు అక్కడకు వచ్చాడు. 'ఎందుకు నాయనా దిగాలుపడి కూర్చున్నావు?' అని ప్రశ్నించాడు. వ్యాపారి తన కష్టనష్టాలన్నీ ఏకరువు పెట్టాడు. 'అలాగా పాపం! నీకు నేను సహాయం చేస్తా!' అంటూ ఒక చెక్ బుక్ తీసి,సంతకం చేసి ఇచ్చాడు. 'నాయనా! నీకు నేను దేవుడిపై భారం వేసి ఈ ఆర్ధిక సహాయం చేస్తున్నాను. నువ్వు సరిగ్గా ఒక సంవత్సరం తరువాత ఇక్కడికే వచ్చి నా బాకీ తీర్చాలి సుమా!' అన్నాడు. అయిదు లక్షల డాలర్ల చెక్ అది. దానిపై రాక్ ఫెల్లర్ అనే సంతకం ఉంది. ఆ పేరు చూడగానే వ్యాపారి దిమ్మెరపోయాడు. తేరుకొని చూస్తే చెక్ ఇచ్చిన రాక్ ఫెల్లర్ అక్కడ లేడు.
'సరే! అప్పులన్నీ తీర్చి మళ్ళా వ్యాపారం కొనసాగించడానికి ఈ డబ్బు చక్కగా సరిపోతుంది. వచ్చే సంవత్సరం ఇదే రోజుకి వచ్చి రాక్ ఫెల్లర్ కు వడ్డీతో సహా మొత్తం చెల్లిస్తా!' అనుకుంటూ వ్యాపారి ఇంటికి పోయాడు. చెక్కును బీరువాలో భద్రపరిచాడు. రెట్టించిన ఉత్సాహంతో మరుసటి రోజు నుంచీ వ్యాపారం తిరిగి ప్రారంభించాడు. అతడి నిబ్బరం చూసి అప్పుల వాళ్ళెవ్వరూ ఒత్తిడి చేయలేదు. చెక్ బ్యాంకులో వేయవలసిన అవసరం లేకుండానే అప్పులన్నీ తీరిపోయాయి. లాభాలు విపరీతంగా వచ్చిపడ్డాయి. అవసరమయితే ఆదుకోవడానికి తన వద్ద అయిదు లక్షల రాక్ ఫెల్లర్ చెక్ ఉంది. ఈ ఆలోచన అతడికి బోలెడు మనో ధైర్యాన్నిచ్చింది. సంవత్సరం గడిచింది. అనుకున్న రోజుకు చెక్ తో సహా వ్యాపారి తోటలో రాక్ ఫెల్లర్ కోసం ఎదురు చూస్తున్నాడు. వృద్ధుడు తడబడే అడుగులతో రానే వస్తున్నాడు. వ్యాపారి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాడు. ఇంతలో ఒక నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి వృద్ధుడుని గట్టిగా పట్టుకుంది. 'అమ్మయ్య దొరికాడు... చూడండి! ఈయనకు మతిస్థిమితం లేదు. మా ఆసుపత్రిలోనే పిచ్చికి వైద్యం చేస్తున్నాం. తాను రాక్ ఫెల్లర్నని అందరికీ చెబుతుంటాడు... ఇదో రకం పెద్ద పిచ్చి!' అంటూ నర్స్ ముసలాడిని బలవంతంగా లాక్కెళ్ళింది.
'పిచ్చోడో మంచోడో! అతడిచ్చిన చెక్ నాకు మనోబలాన్ని ఇచ్చి వ్యాపారంలో నేను మళ్ళా నిలదొక్కుకునేట్లు చేసింది' అనుకున్నాడు ఆశ్చర్యం నుంచి తేరుకున్న వ్యాపారి.
Source: ఈనాడు అంతర్యామి
No comments:
Post a Comment